కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును.. అడ్డుకునే దిశగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటి అమలును నిలిపివేసేందుకు వీలుగా ఓ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ఆయా రాష్ట్రాలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నాయి.
గత నెలలోనే సోనియా పిలుపు
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అడ్డుకునే అవకాశాలను పరిశీలించాలని తమ పార్టీ పాలనలోని రాష్ట్రాలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గతంలోనే పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఓ ముసాయిదా బిల్లును పార్టీ రూపొందించింది. 'రైతుల హక్కు, ప్రత్యేక భద్రతా నిబంధన బిల్లు 2020' గా ఈ బిల్లుకు పేరు పెట్టారని సమాచారం.
రాష్ట్రాలకే అధికారం
వ్యవసాయ చట్టాలను ఎప్పటి నుంచి అమలు చేయాలన్న దానిపై రాష్ట్రాలకే అధికారం ఉండేలా అందులో నిబంధన ఉంది. మద్దతు ధర(ఎంఎస్‌పీ) కంటే తక్కువకు రైతుల నుంచి వ్యాపారులు పంట కొనుగోలు చేయకుండా నిరోధించే నిబంధన కూడా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి సదరు బిల్లును ఆమోదించే అవకాశముంది.
'ఖేతీ బచావో' యాత్ర
రైతుల సమస్యలకు తమదైన శైలిలో పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఖేతీ బచావో యాత్రను ప్రారంభించారు. పంజాబ్లో మొదలైన ఈ యాత్ర హరియాణా నుంచి దిల్లీ వరకు సాగుతుంది.