కేంద్ర ప్రభుత్వం మిడతల దాడులను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని, పంటల బీమా పథకం కింద రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే మిడతల దాడులతో నాశనమైన పంటలపై (గిర్దావారీ) సర్వే నిర్వహించి.. నష్టపోయిన రైతులందరికీ ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ కూడా ప్రకటించాలని పేర్కొంది.
"వ్యవసాయశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎమ్ఏ)కు చెందిన 'ప్రకృతి విపత్తు' నిర్వచనంలో మిడతల దాడిని చేర్చాలని, తద్వారా పంటల బీమా పథకం కింద రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది."
- రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
చప్పట్లే పరిష్కారమా?
'సాధారణంగా మిడతల దాడి జరిగినప్పుడు రైతులు, సామాన్య ప్రజలు... చప్పట్లు కొట్టడం లేదా ప్లేటు తిరగేసి దరువు వేయాలని చెబుతారు. అయితే మోదీ సర్కార్.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చప్పట్లు కొట్టాలని, ప్లేట్లపై దరువు వేయాలని చెబుతోంది. అలాగే మిడతలను తరిమి కొట్టడానికి కూడా ఇదే విధానం పాటించాలని చెబుతోంది. ఇంతకీ మోదీ ప్రభుత్వం దగ్గర మిడతల సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం ఏమీ లేదా?' అని రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఈ మిడతల సమస్య నివారణను శాస్త్రీయ, హేతుబద్ధమైన పరిష్కారం కనుక్కోవాలని ఆయన అన్నారు.
పరిహారం ఏదీ?
మిడతల దాడితో హరియాణా, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్ల్లోని పంటలు నాశనమయ్యాయని రణదీప్ సూర్జేవాలా అన్నారు. ఇప్పుడు ఈ కీటకాలు దిల్లీపై కూడా దాడిచేస్తున్నాయని అన్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ మిడతల సమూహాల వల్ల.. సుమారు 84కిపైగా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... మోదీ సర్కార్ను హెచ్చరించినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని రణదీప్ విమర్శించారు.
"మిడతల దాడుల వల్ల 10 లక్షల హెక్టార్లకుపైగా పంట భూములు తీవ్రంగా నష్టపోయాయి. కానీ ప్రభుత్వం రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. బీమా సంస్థలు కూడా పంట బీమా పథకం కింద రైతులకు పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం.. మిడతల సమూహ దాడిని ప్రకృతి విపత్తుగా ప్రకటించకపోవడమే."
- రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
పంట పొలాలపై దాడులు చేసి రైతులకు తీవ్ర నష్టాలన్నీ కలగజేస్తున్న మిడతలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం... ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
ఇదీ చూడండి: బార్లు, క్లబ్బులకు అనుమతి.. ఆ సరుకు అమ్మేందుకే!