కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా మూతపడిన పాఠశాలలను జనవరి 4 నుంచి తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని సీఐఎస్‌సీఈ (ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్) కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. ఐఎస్‌సీ, ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే ఈ సంస్థ.. పాఠశాలలు తెరిస్తే 10, 12 తరగతుల విద్యార్థులు తమ ప్రాజెక్టు వర్క్స్, ప్రాక్టికల్ వర్క్స్ చేసుకొనేందుకు, సందేహాల నివృత్తికి ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడింది. పాఠశాలల పునఃప్రారంభించేందుకు అనుమతిస్తే కొవిడ్ నియంత్రణ చర్యలను పాటిస్తారని సీఐఎస్‌సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెర్రీ అరథూన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో నిర్వహించే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. తద్వారా ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ బోర్డు పరీక్షల తుది తేదీలను ఖరారు చేసేందుకు వీలుపడుతుందని అరథూన్ ప్రకటనలో తెలిపారు. ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారులో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొనేందుకు వీలుగా ఎన్నికల తేదీలను కోరినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.