దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న 50కిపైగా జిల్లాలు, మునిసిపాలిటీల్లో ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను నియమించింది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఈ మొత్తం జిల్లాలు 15 రాష్ట్రాల పరిధిలోనే ఉన్నట్లు తెలిపింది కేంద్రం. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రాలకు సాంకేతిక సహకారం కోసం ఈ ఏర్పాటు చేసింది.
రాష్ట్రం | జిల్లా/ మునిసిపాలిటీలు |
మహారాష్ట్ర | 7 |
తెలంగాణ | 4 |
తమిళనాడు | 7 |
రాజస్థాన్ | 5 |
అసోం | 6 |
హరియాణా | 4 |
గుజరాత్ | 3 |
కర్ణాటక | 4 |
ఉత్తరాఖండ్ | 3 |
మధ్యప్రదేశ్ | 5 |
బంగాల్ | 3 |
దిల్లీ | 3 |
బీహార్ | 4 |
ఉత్తర ప్రదేశ్ | 4 |
ఒడిశా | 5 |
ఒక్కో బృందంలో ఇద్దరు ఆరోగ్య నిపుణులు ఉంటారు. పరిపాలన సౌలభ్యం కోసం బృందానికి ఒక సంయుక్త కార్యదర్శి స్థాయి నోడల్ అధికారిని నియమించారు. ఈ బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను సందర్శిస్తారు. వారు సేకరించిన వివరాల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తారు.
సమన్వయం కోసం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ఈ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫలితంగా కేసుల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాలు లేదా మునిసిపాలిటీలు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వీలుంటుంది.
కరోనా నియంత్రణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా రాష్ట్రాలకు ఈ బృందాలు సహాయం చేస్తాయి. కేసుల పెరుగుదల, వైద్య సదుపాయాలు, మరణాలు రేటు తదితర అంశాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలకు సూచనలు చేస్తాయి.
ఇదీ చూడండి: ఇదే మొదటిసారి?...ఒకే ఇంట్లో 26 మందికి కరోనా