జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించినందుకు బోడో ఉద్యమకారులకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. బోడో ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంతో అసోంలో మంచి రోజులు రానున్నాయని వ్యాఖ్యానించారు.
అసోంలోని కోక్రాఝర్ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. పౌరసత్వ చట్ట సవరణ తర్వాత మొదటిసారి అసోంలో పర్యటించారు. అసోం రాష్ట్ర ప్రభుత్వం, బోడోలాండ్ ఉద్యమ సంఘాల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు రాష్ట్రంలో వేడుక చేసుకునేందుకు ఈ సభను నిర్వహించగా... భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. బోడో ఒప్పందంతో అన్ని వర్గాల ప్రజలు గెలిచినట్లేని మోదీ వ్యాఖ్యానించారు.
"మీ అందరి సహకారంతో ఈ శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యమైంది. ఈ రోజు అసోంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో నూతన శకం మొదలైంది. ఇది సరికొత్త సూర్యోదయం. అభివృద్ధి, విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలి. ఈ భూమిపై మళ్లీ హింస చెలరేగొద్దు. ఈ భూమిపై ఎవరి రక్తం చిందించాల్సిన పని ఉండదు."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
సీఏఏపై..
సీఏఏపైనా స్పష్టతనిచ్చారు ప్రధాని మోదీ. చట్టం అమలైతే లక్షలాది వలసలు వస్తాయని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అలాంటిదేదీ జరగదని హామీ ఇచ్చారు.