లద్దాఖ్‌లోని భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న వారికి భారత సైన్యం దీటైన జవాబు ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. స్నేహ బంధాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని.. అదే సమయంలో శత్రువులకు సరైనా సమాధానం చెప్పే సామర్థ్యం దేశానికి ఉందని చైనాను పరోక్షంగా హెచ్చరించారు మోదీ.
గల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన 20మంది జవాన్లకు.. మనసులో మాట కార్యక్రమం వేదికగా నివాళులర్పించారు మోదీ. సైనికులు తమ ధైర్యసాహసాలతో.. భారత కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా అడ్డుకున్నారని తెలిపారు.
చైనాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని మరోమారు ప్రస్తావించారు ప్రధాని. దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదద్దడానికి అది ఉపయోగపడుతుందన్నారు. అదే అమర జవాన్లకు దేశమిచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.
"ఒకప్పుడు మన వెనకాల ఉన్న ఎన్నో దేశాలు.. ఇప్పుడు మనకన్నా ముందుకు దూసుకుపోతున్నాయి. దేశ స్వాతంత్య్రం అనంతరం మన రక్షణ విభాగంపై శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. కానీ ఈ రోజున.. రక్షణ విభాగం, సాంకేతికత రంగం అభివృద్ధికి దేశం తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. ఎవరిపైనా ఆధారపడకుండా.. స్వీయ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తే.. మీరు కూడా దేశ శక్తిని పెంపొందించినవారు అవుతారు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
'కరోనాను ఓడించాలి'
అన్‌లాక్ దశలో కరోనా వైరస్‌ను ఓడించాలని, ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వాలని దేశ ప్రజలకు సూచించారు ప్రధాని. ఎన్నో సవాళ్లను దేశం తనకు సానుకూలంగా మల్చుకుందని.. ఈ సారి కూడా అదే జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఈ అన్‌లాక్ దశలో ప్రతి భారతీయుడు రెండు విషయాలపై దృష్టి సారించాలి. ఒకటి కరోనాను ఓడించడం, రెండు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. ప్రజలు బయటకు వస్తుంటే... లాక్డౌన్లో కన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోంది. మాస్కులు లేకుండా, భౌతిక దూరం నియమాలను పాటించకుండా మీరు బయట ఉంట.. మీతో పాటు మీ చుట్టుపక్కన వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్టే."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి:- ఆ రెండు యుద్ధాల్లో భారత్‌దే గెలుపు.. కానీ..: షా