అయోధ్యపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు నమ్మకాల ఆధారంగా కాకుండా సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ ముస్లిం సంస్థ జమాయిత్ ఉలమా ఇ హింద్ విశ్వాసం వ్యక్తం చేసింది. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై తీర్పు ఏదైనా తమకు సమ్మతమేనని ప్రకటించింది. హిందూ వర్గాల మొండి వైఖరి కారణంగానే మధ్యవర్తిత్వం విఫలమైందని పేర్కొన్నారు జమాయిత్ ఉలమా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్ మదానీ.
శాంతియుతంగా వ్యవహరించాలి
ప్రతి ముస్లిం కూడా న్యాయస్థానం తీర్పును గౌరవించాలని పిలుపునిచ్చింది జమాయిత్ ఉలమా ఇ హింద్. ఎలాంటి ప్రార్థనా మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించలేదన్నది ముస్లింల విశ్వాసమని జమాయిత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ వెల్లడించారు. కోర్టుకు కూడా అదే విషయం చెప్పామన్నారు. ఒకవేళ అందుకు విరుద్ధంగా తీర్పు వచ్చినా శాంతియుతంగా వ్యవహరించాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఇది భూవివాదానికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదని, అత్యున్నత న్యాయస్థానానికి ఓ పరీక్ష లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లింలకు అనుకూలంగా తీర్పు వస్తే తామంతా చర్చించి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
సాక్ష్యాల ఆధారంగా వెలువడే తీర్పును... న్యాయవ్యవస్థ పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, నమ్మకాలు, విశ్వాసాలను ఇక్కడ పక్కన పెట్టాలని అర్షద్ సూచించారు. తమ విశ్వాసాలను పాటిస్తూనే దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల ఐక్యతను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.