వాస్తవాదీన రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), శశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, హోంమంత్రిత్వ శాఖ, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ ఉన్నతాధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
కీలక ప్రాంతాల్లో హైఅలర్ట్!
ఇప్పటికే ఎస్ఎస్బీకి చెందిన పలు సైనిక బృందాలను అరుణాచల్ ప్రదేశ్, భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అత్యంత కీలక ప్రదేశాలుగా పరిగణిస్తున్న ఉత్తరాఖండ్, సిక్కింలో భారత్-చైనా-టిబెట్ కలిసే ట్రై-జంక్షన్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
చైనా సరిహద్దుల్లో పారా మిలటరీ దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం సరిహద్దుల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. సిక్కిం, ఉత్తరాఖండ్ ట్రై-జంక్షన్ ప్రాంతాలకు 80 సైనిక బలగాలను పంపినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే లేహ్‌లో పర్యటిస్తున్నారు.
ఇదీ చూడండి: 'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'