కరోనా విజృంభిస్తున్న తీరు, ప్రభుత్వం చేస్తున్న మార్గదర్శకాలతో ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా వైరస్‌పై పోరాడాలని నిర్ణయించుకున్నాడు ఓ వ్యక్తి. స్వచ్ఛందంగా వైరస్‌పై పోరాడేందుకు నడుం బిగించాడు. తన సొంత ఖర్చుతో గ్రామాలను శానిటైజ్ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. గుజరాత్ ఖేడా జిల్లా వాసి దేవేంద్రభాయ్ పటేల్.
వైరస్‌పై పోరులో తాను భాగం కావాలని నిర్ణయించుకుని.. ఈ దిశగా కార్యాచరణను చేపట్టాడు. రూ. లక్ష ఖర్చుతో గ్రామాలను శానిజైజ్ చేస్తున్నాడు. ఖేడా జిల్లావ్యాప్తంగా కరోనాను అరికట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపాడు దేవేంద్ర. రోజూ ఉదయాన్నే బైక్‌పై ఓ పిచికారీ పంపుతో బయల్దేరి.. పట్టణాలు, గ్రామాల్లోని రహదారులు, ఇళ్లపై శానిటైజర్ జల్లుతున్నాడు. ఇలా ఇప్పటివరకు 5వేల గ్రామాలను శుభ్రపరిచాడు.
మోదీ స్ఫూర్తితో..
దేశం కోసం రోజూ 12 గంటలు పనిచేసే ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పాడు దేవేంద్ర. 'ప్రధాని అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నపుడు మనం కూడా సరైన శ్రద్ధ తీసుకోవాలని' వెల్లడించాడు. మోదీ స్ఫూర్తితో రోజుకు 15 గంటల పాటు వైరస్ నియంత్రణ కోసం శ్రమిస్తున్నట్లు చెప్పాడు.
ఇదీ చదవండి: కరోనా కాలంలో చేతులకు పూతలే రక్షణ!