కేరళలో ఇటీవల గర్భంతో ఉన్న ఏనుగు మృతి ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఆ తర్వాత అదే తరహాలో పలు ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గజరాజుల మృతిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేరళలో గడిచిన 10 సంవత్సరాల (2010-2020 ) కాలంలో అసహజంగా, మానవతప్పిదాలతో 64 అటవీ ఏనుగులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ శాఖ రికార్డులు సూచిస్తున్నాయి. అయితే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని వన్యప్రాణుల నిపుణులు పేర్కొన్నారు.
ఒకే ఏడాదిలో 14..
వేట, విద్యుదాఘాతం, రోడ్డు ప్రమాదాలు, పేలుళ్లు వంటి వాటిలో మరణిస్తే వాటిని అసహజ మరణాల కింద లెక్కగడతారు అధికారులు. అలాంటి ఘటనల్లో 2015-16 సమయంలోనే అధిక మరణాలు సంభవించాయి. మలయట్టూర్ అటవీ ప్రాంతం పరిధిలో 14 ఏనుగులు మృతి చెందాయి. దాని తర్వాత 2018-19 ఏడాదిలో 10 గజాలు ప్రాణాలు కోల్పోయాయి.
సహజంగా 772 మృతి..
మరోవైపు.. దశాబ్ద కాలంలో సహజ కారణాలతో మొత్తం 772 అటవీ ఏనుగులు మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. 2017లో నిర్వహించిన వన్యప్రాణుల గణన ప్రకారం కేరళలో 5,706 అటవీ ఏనుగులు ఉన్నాయి.
ఉద్దేశపూర్వకంగా కాదు..
పాలక్కడ్ జిల్లాలో ఇటీవల గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి ఉద్దేశపూర్వంగా చేసింది కాదని పేర్కొన్నారు అటవీ శాఖ అధికారులు. అడవి పందుల కోసం పేలుడు సామగ్రిని ఆహారపదార్థాలతో కలిపి పెట్టిన సందర్భంలో వాటని తినేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు జరిగినట్లు తెలిపారు. ఏనుగు మృతి నేపథ్యంలో అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయి నిఘా పెట్టినట్లు రాష్ట్ర అటవీశాఖ ప్రధాన అధికారి సురేంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 40 రోజుల్లో అక్కడ 6 ఏనుగులు మృతి- ఏమైంది?