జమ్ముకశ్మీర్‌లో దాదాపు 5 నెలల క్రితం నిలిచిపోయిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ 2జీ మొబైల్ అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 2జీ ఇంటర్నెట్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన 301 వెబ్సైట్లను మాత్రమే వినియోగించేందుకు వీలుంటుందని జమ్ముకశ్మీర్ హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ వ్యాలీ వాసులకు మరికొద్దిరోజులు సామాజిక మాధ్యమాలను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం ఆమోదించిన సైట్లలో బ్యాంకింగ్, వార్తా, ప్రయాణం, మౌలిక సదుపాయాలు, ఉపాధికి సంబంధించిన సైట్లు ఉన్నాయి.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా గతేడాది ఆగస్టు 15న జమ్ముకశ్మీర్‌లో ల్యాండ్‌లైన్, మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది ప్రభుత్వం. కశ్మీర్లో ఆంక్షలు విధించడంపై వారంలోపు సమీక్షించాలని జనవరి 10న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2జీ మొబైల్ అంతర్జాల సేవలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లో ఇంటర్నెట్ను నిలిపివేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాలం దేశంలోని ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా అభివర్ణించింది.
ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!