Hedgewar RSS: బ్రిటిష్ సామ్రాజ్ఞికి పట్టాభిషేకం జరిగి 60 ఏళ్లు అవుతున్న సందర్భమది. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు మిఠాయిలు పంచుతున్నారు. పిల్లలంతా నిశ్శబ్దంగా వాటిని తీసుకుంటున్నారు. నిండా 15 ఏళ్లు కూడా లేని ఓ బాలుడు మాత్రం అనూహ్యంగా మిఠాయిని నేలకేసి కొట్టడంతో అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. అసలే తల్లిదండ్రులు లేని పిల్లాడు.. ఇప్పుడు అధికారుల ఆగ్రహానికి బలయ్యేలా ఉన్నాడంటూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అతను మాత్రం 'ఇప్పుడు మనకు కావాల్సింది మిఠాయిలు కాదు.. మనల్ని మనమే పాలించుకునే స్వాతంత్య్రం' అని ధైర్యంగా పలికాడు. పైగా తోటి విద్యార్థులంతా వందేమాతరం అంటూ నినదించేలా చేశాడు. నాటి ఆ బాలుడే కేశవరావు బలిరాం హెడ్గేవార్.
azadi ka amrit mahotsav: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో బలిరాం పంత్, రేవతి దంపతులకు 1889 ఏప్రిల్ 1న ఉగాది రోజు కేశవరావు బలిరాం హెడ్గేవార్ జన్మించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన వారి పూర్వీకులు నాగ్‌పుర్‌కు వలస వెళ్లారు. హెడ్గేవార్ తల్లిదండ్రులిద్దరూ 1902లో ప్లేగు బారినపడి మృతిచెందారు. అప్పుడాయన వయసు 13 ఏళ్లు మాత్రమే. నాటి నుంచి హెడ్గేవార్ బాగోగులను ఆయనకు వరుసకు మామ, హిందూ మహాసభ అధ్యక్షుడైన బి.ఎస్. ముంజే చూసుకున్నారు. హైస్కూలులో ఉండగానే ఆంగ్లేయులు పంచిన మిఠాయిని నేలకు కొట్టి.. పరాయి పాలనను నిరసించారు హెడ్గేవార్. దేశాన్ని పట్టిపీడిస్తున్న రాణిని కీర్తించడం మాని.. తల్లి భారతిని ప్రార్థించాలంటూ విద్యార్థులందరితో వందేమాతరం పలికించారు. పాఠశాల నుంచి బహిష్కరణకు గురైనా బెదరకుండా.. చిన్నవయసులోనే తనలో స్వాతంత్య్ర కాంక్ష ఎంత బలీయంగా ఉందో చాటిచెప్పారు. తర్వాత చదువులను యవత్మాల్, పుణెలో పూర్తిచేశారు. మెట్రిక్యులేషన్ తర్వాత వైద్య విద్యను అభ్యసించేందుకు 1910లో కలకత్తా వెళ్లిన హెడ్గేవార్ 1917లో ఫిజిషియన్‌గా పట్టా అందుకున్నారు.
ఆలోచనలకు దారిచూపిన కలకత్తా: భారత స్వాతంత్య్ర పోరాటంలో అతివాద బాట పట్టిన తొలి గ్రూపు అనుశీలన్ సమితి. హెడ్గేవార్ కలకత్తాలో చదువుకుంటున్న రోజుల్లో అందులో చేరారు. సాయుధ తిరుగుబాటు ద్వారా దేశానికి స్వేచ్ఛను తీసుకురావచ్చని నమ్మేవారు. ఒకవైపు వైద్యవిద్యను అభ్యసిస్తూనే అనుశీలన్ సమితిలో క్రియాశీల సభ్యుడిగా కొనసాగారు. మరోవైపు బంకించంద్ర ఛటర్జీ ఆనంద్‌మఠ్, వినాయక్ దామోదర్ సావర్కర్ రాసిన హిందుత్వ, సమర్థ రామదాసు రాసిన దశ్‌బోధ్, బాలగంగాధర్ తిలక్ రచించిన గీతారహస్యం పుస్తకాలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి.
సైద్ధాంతిక భావాలకు స్పష్టత: కలకత్తా నుంచి 1917లో నాగ్‌పుర్‌కు వచ్చేశాక హెడ్గేవార్ తన మిత్రులతో కలిసి కాంగ్రెస్‌లో పనిచేశారు. గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 1921లో ఏడాదిపాటు జైలుశిక్ష విధించింది. అనంతర కాలంలో కాంగ్రెస్ విధానాలతో విభేదించారు. విదేశీయుల అపార శక్తి కారణంగా మనదేశం పరాయిపాలనలోకి వెళ్లలేదని, మన సమాజంలోని లోపాలు, అనైక్యత వల్లే మనం ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్లామని గట్టిగా వాదించేవారు. బ్రిటిషర్లపై పోరాటం చేస్తూనే మనదైన సంస్కృతికి పునరుజ్జీవం తేవాలని బలంగా నమ్మేవారు. తనలోని సైద్ధాంతిక భావాలకు స్పష్టత ఇచ్చే క్రమంలో 1925లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను స్థాపించారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు.
కానీ.. స్వయం సేవకులు తమ సంస్థ తరఫున కాకుండా వ్యక్తిగతంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడానికి ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ పదవిని తాత్కాలికంగా మరొకరికి అప్పగించడం విశేషం. లాహోర్‌లో 1929 నవంబరు 26న జరిగిన కాంగ్రెస్ జాతీయ సభలో భారత్‌కు సంపూర్ణ స్వరాజ్యం కావాలని చేసిన తీర్మానాన్ని హెడ్గేవార్ అమితంగా స్వాగతించారు. 1930 నవంబరు 26ను దేశ స్వాతంత్య్ర దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తాను స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్‌ను దేశమంతటా విస్తరించే క్రమంలో ఆయన చేసిన ప్రయాణాల కారణంగా తీవ్ర వెన్నునొప్పి బారిన పడ్డారు. చివరికి 1940 జూన్ 21న నాగ్‌పుర్‌లో తుదిశ్వాస విడిచారు. దేశానికి హెడ్గేవార్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆయన్ని 'భరతమాత ముద్దుబిడ్డ'గా అభివర్ణించారు.
ఇదీ చూడండి : ముస్లిం చిన్నారికి 'శివమణి'గా నామకరణం.. ఆ స్వామీజీ గుర్తుగా..!