Nizamabad Hospital Viral Video: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగిని సహాయకులు.. అతడిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారు. స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి ఉండగా.. నేలపైనే పడుకోబెట్టి ఈడ్చుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆస్పత్రి సిబ్బందిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
అయితే ఈ వీడియోపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. మార్చి 31న సదరు రోగి ఆసుపత్రికి వచ్చారన్న సూపరింటెండెంట్.. అత్యవసర విభాగంలో పరీక్షల అనంతరం జనరల్ మెడిసిన్ విభాగానికి వెళ్లాలని సూచించారని తెలిపారు. రోగులు వేచి ఉండే హాలులో బెంచ్‌పైన కూర్చోబెట్టి.. పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కుర్చీ తెచ్చేలోపే వారి తల్లిదండ్రులు లాక్కెళ్లారని వివరణ ఇచ్చారు. వీల్ చైర్‌లోనే సిబ్బంది తీసుకెళ్లారని ప్రతిమారాజ్ స్పష్టం చేశారు. సిబ్బంది పట్టించుకోలేదనడం అవాస్తవమని.. లిఫ్ట్ వచ్చిందన్న తొందరలో సహాయకులే అలా లాక్కెళ్లారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారించి తదుపరి చక్రాల కుర్చీలో తీసుకెళ్లారని వెల్లడించారు.
ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తగదు..: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని ప్రతిమారాజ్ విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలందరికీ ఎన్నో రకాలుగా సేవలందిస్తూ, అన్ని రకాల చికిత్సలు చేస్తూ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిపై ఈ విధంగా దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు.. ప్రభుత్వ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
"సంబంధిత రోగి మార్చి 31న ఆస్పత్రికి వచ్చారు. అత్యవసర విభాగంలో పరీక్షల అనంతరం జనరల్ మెడిసిన్ విభాగానికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. రోగులు వేచి ఉండే హాలులో బెంచ్‌పైన కూర్చోబెట్టి.. పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కుర్చీ తెచ్చేలోపే వారి తల్లిదండ్రులు లాక్కెళ్లారు. రోగిని వీల్ చైర్‌లోనే సిబ్బంది తీసుకెళ్లారు. సిబ్బంది పట్టించుకోలేదనడం అసత్యం. లిఫ్ట్ వచ్చిందన్న తొందరలో సహాయకులే లాక్కెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించి చక్రాల కుర్చీలో తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా దుష్ప్రచారాలు చేయడం తగదు. ఈ ఘటనకు, ఆసుపత్రికి ఏ సంబంధం లేదు." - ప్రతిమారాజ్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
విచారణకు మంత్రి ఆదేశం..: వైరల్ వీడియోపై తాజాగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను విచారణకు ఆదేశించారు. నిజానిజాలు తెలిసేలా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఇవీ చూడండి..
Response : 'చిన్నప్రాణం.. పెద్దగండం' కథనానికి స్పందన.. ఆపరేషన్ సక్సెస్..!
పరిశ్రమ పునః ప్రారంభించి ఇక్కడే ఉత్పత్తి చేయండి.. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల విన్నపం