"బంగాల్ దంగల్.. మిషన్ బంగాల్.. బంగాల్ గడ్డపై జెండా పాతేందుకు భాజపా వ్యూహాలు..." ఇవీ గత కొన్ని నెలలుగా కమలదళం గురించి దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాటలు. దీనితో.. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బంగాల్పై భాజపా ప్రత్యేక దృష్టి సారించిందని అందరూ భావిస్తున్నారు. అయితే.. ఎన్నికల హడావుడిని క్షుణ్నంగా పరిశీలిస్తే.. ఓ కొత్త విషయం తెలుస్తుంది. బంగాల్ కాకుండా.. మరో రాష్ట్రంపై భాజపా హైకమాండ్ దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఆ రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టు అర్థమవుతుంది. అదే.. ఈశాన్య భారతానికి వారధిగా పిలిచే 'అసోం'. ఎన్నికలు ముగిసే సమయానికి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోంలో కనీసం 7సార్లు పర్యటించే అవకాశముంది. టార్గెట్ 'అసోం'పై భాజపా ఏ స్థాయిలో కసరత్తు చేస్తోందో చెప్పడానికి.. ఈ ఒక్క విషయం చాలు.
అసలు అసోంకు భాజపా ఇంతటి ప్రాధాన్యం ఎందుకిస్తోంది? అసోంలో గెలవడం భాజపాకు ఎందుకంత ముఖ్యం?
భాజపా చూపు.. అసోంవైపు..
అసోంలో భాజపా ఇప్పటికే అధికారంలో ఉంది. ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీల( బంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి)తో పోల్చితే.. అసోంలో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కమలదళం భావిస్తోంది. ఆ రాష్ట్రంపై ఎక్కువ దృష్టిపెట్టడానికి ఇదే అతి పెద్ద కారణంగా తెలుస్తోంది.
మరోవైపు అసోంలో విజయంపైనే ఎన్డీఏ ఏఈపీ(యాక్ట్ ఈస్ట్ పాలసీ) ఆధారపడి ఉంది. ఈశాన్య భారతాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని భాజపా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. మయన్మార్, మొదలైన అగ్నేయాసియా దేశాల నుంచి తూర్పున ఉన్న జపాన్ వరకు అన్నింటితో బంధం ఏర్పరచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఇండో-చైనా ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారత్-జపాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది అదనపు బలం చేకూరుస్తుందని విశ్వసిస్తోంది.
ఇదీ చూడండి:- దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!
జపాన్‌తో బంధం...
ఈశాన్య భారతంలో మౌలిక వసతుల అభివృద్ధికి జపాన్ ఆసక్తి చూపిస్తోంది. ఇందులో భాగంగానే.. 2017లో 'ఇండియా-జపాన్ కోఆర్డినేషన్ ఫారం ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ఈస్ట్' పేరుతో.. ఓ వేదికను ఏర్పాటు చేసింది. జపాన్ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. తాము తిరిగి అధికారం చేపట్టడం ముఖ్యమని భాజపా యోచిస్తోంది.
రాజకీయంగా...
దేశవ్యాప్తంగా చూస్తే.. అనేక ప్రాంతాలపై భాజపా పట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. రైతు ఉద్యమం దీనికి కొంత మేర గండి కొట్టినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లో భాజపాకు మద్దతు క్షీణిస్తోందని అంటున్నారు. అందుకే.. కొత్త ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని కమలదళం చూస్తున్న వేళ.. అసోం ఎన్నికల రూపంలో ఆ అవకశం వచ్చిందని చెబుతున్నారు.
మిజోరాం మినహా.. ఈశాన్య భారతంలోని మిగిలిన ఆరు రాష్ట్రాల్లో భాజపాకు గట్టి పట్టు ఉంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మణిపుర్లో భాజపా అధికారంలో ఉండగా.. మేఘాలయ, నాగాలాండ్‌లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది.
ఇదీ చూడండి:- భాజపాతో కటీఫ్.. బీపీఎఫ్ ప్రకటన
సవాళ్ల వారధి...
ఈశాన్యానికి వారధిగా అసోంను పిలుస్తారు. ఇక్కడ అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం కమలదళానికి ఎంతో ముఖ్యం. కానీ అది అంత సులువైన విషయమేమీ కాదు.
ఎన్నికల వేళ.. అనేక మంది భాజపాలోకి వచ్చి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త-పాత మధ్య కలహాలు ఏర్పడతాయని పార్టీ శ్రేణులు భయపడుతున్నారు. టికెట్ల విషయంలో భాజపాలోని అంతర్గత విభేదాల సంగతి సరేసరి. ఈ క్రమంలోనే సీఎం శర్బానంద్ సొనోవాల్- మంత్రి హిమాంత బిశ్వ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. బిశ్వ శర్మ.. అసోం రాజకీయాల్లో శక్తిమంతమైన నేత కావడం గమనార్హం.
ఇదీ చూడండి:- భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన రాష్ట్ర మంత్రి
వీటన్నింటినీ పక్కన పెట్టి.. ప్రజల్లోకి వెళ్లాలని కాషాయ దళం ఆశిస్తోంది. ప్రధాని మోదీ- కేంద్ర హోంమంత్రి అమిత్ షా విస్త్రత ప్రచారాలతోనే ఇది సాధ్యపడుతుందని ధీమాగా ఉంది.
ఓవైపు భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని పార్టీ నేతలు బయటకు చెబుతున్నారు. కానీ ఇది అంత సులభమైన విషయం కాదని అర్థమవుతోంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా బలం దక్కకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు.. పౌరసత్వ చట్టం గురించి గతంలో ఈశాన్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. అయినప్పటికీ.. సీఏఏపై వెనక్కి తగ్గేది లేదని భాజపా తేల్చిచెబుతోంది. ఇది బ్రహ్మపుత్ర లోయలోని వారికి నచ్చడం లేదు. వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
అసోం జాతీయ పరిషద్- రైజోర్ దాల్ కలిసి కూటమిగా రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాయి. అధికార వర్గానికి షాక్ ఇచ్చే శక్తి వీటికి ఉందని అనేక మంది భావిస్తున్నారు.
పశ్చిమ అసోంలో ప్రత్యర్థుల నుంచి భాజపాకు గట్టిపోటి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, బోడో పీపుల్స్ ఫ్రంట్ కూటమి నుంచి సవాళ్లు తప్పవని భాజపా శ్రేణులకు ఇప్పటికే అర్థమైంది.
కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థికంగా కుదేలవడం కూడా భాజపాకు ప్రతికూలంగా మారింది.
గత ఎన్నికల్లో..
126 స్థానాలున్న అసోం అసెంబ్లీకి 2016లో జరిగిన ఎన్నికల్లో.. భాజపా 60 సీట్లు దక్కించుకుంది. అధికార కూటమిలోని ఇతర పార్టీలైన ఏజీపీని 14, బీపీఎఫ్‌ను 12 స్థానాలు వరించాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు 26, ఏఐయూడీఎఫ్‌కు 13 సీట్లు దక్కాయి. ఓ స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
మొత్తం మీద చూస్తే.. విజయం భాజపావైపే ఉందని అనిపించినా.. ఆ ప్రయాణం అంత సులభం కాదని అర్థమవుతోంది. అందుకే మోదీ వంటి అగ్రనేతలు అసోం ఎన్నికల ప్రచారాల్లో తరచూ పాల్గొని.. భాజపా శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.
(రచయిత- సంజీవ్ బారువా)