జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతం ఏదైనా వర్గ భేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ.. అందరినీ సమానంగా గౌరవిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. అందరినీ గౌరవించటమే కాంగ్రెస్ బలమన్నారు. ఈ విధానాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు. కశ్మీర్లో కాంగ్రెస్ అసంతృప్తి నేతలు(జీ-23) ఏర్పాటు చేసిన 'శాంతి సమ్మేళన్' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నార్త్- సౌత్ ప్రజలు అంటూ.. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మాట్లాడిన నేపథ్యంలో.. ఆజాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కేరళ తిరువనంతపురంలో ఇటీవల చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.."గత పదిహేనేళ్లుగా ఉత్తర భారతం నుంచే ఎంపీగా ఎన్నికయ్యాను. అక్కడ విభిన్నమైన రాజకీయాలకు అలవాటు పడ్డాను. కానీ కేరళకు వస్తే నా మనసు తేలికవుతుంది. ఇక్కడ ప్రజలు అనవసర అంశాలపై గాక అసలైన సమస్యల గురించి ఆలోచిస్తారు." అని అన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదంగా మారాయి.
గత 5-6 ఏళ్లలో జమ్ముకశ్మీర్‌లో నిరుద్యోగం, రాష్ట్ర హోదాను తొలగించటం, పరిశ్రమలు, జీఎస్టీ అమలు.. తదితర అంశాలపై జీ-23 సభ్యులు అందరూ తమ గళం వినిపించారని ఆజాద్ తెలిపారు.
ఆజాద్ సేవలను ఎందుకు ఉపయోగించుకోవటం లేదు?
దేశంలో.. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను ఇంజినీర్‌గా అభివర్ణించారు కపిల్.
''ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే అనుభవం ఆజాద్‌కు ఉంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పట్టు ఉన్న నాయకుడు ఆజాద్. ఆయన అనుభవాన్ని కాంగ్రెస్ ఎందుకు ఉపయోగించుకోవటం లేదో నాకర్థం కావటం లేదు.''
- కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇతర సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, రాజ్ బబ్బర్, వివేక్ టంకా, భూపేంద్ర సింగ్ హుడా తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులను కోరుతూ గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి 23 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు లేఖ రాశారు. ఈ లేఖపై పార్టీలో అంతర్గతంగా పెద్ద దుమారమే చెలరేగింది.
ఇదీ చదవండి : 'మహిళల రిజర్వేషన్లకు పూర్తి మద్దతు'