ఐటీ సంస్థల్లో మాదిరిగా 'కట్, కాపీ, పేస్ట్' విధానాన్ని హైకోర్టులు అవలంబించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సరైన కారణాలను తమ ఆదేశాల్లో వివరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లు ఇచ్చిన ఆర్డర్లను యథావిధిగా తమ ఆదేశాల్లో పొందుపరిచి.. ఆర్డర్ కాపీల సైజును పెంచుతున్నాయని పేర్కొంది.
"హైకోర్టులు కట్, పేస్ట్ చేస్తుండటాన్ని చూడటం అసహ్యంగా ఉంది. తమ ఆర్డర్లలో సొంత అభిప్రాయాలను పొందుపర్చడం లేదు."
-జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ఓ అధికారికి ఐఏఎస్ క్యాడర్ ఇచ్చేలా యూపీఎస్సీకి ఆదేశాలివ్వాలన్న వ్యాజ్యాన్ని ఒడిశా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(సీఏటీ) విచారించింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒడిశా హైకోర్టు సమర్థించింది. కాగా.. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది యూపీఎస్సీ. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
అధికారికి ఐఏఎస్ హోదా ఇవ్వకపోవడానికి సరైన కారణాలు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారని ధర్మాసనం అభిప్రాయపడింది. సదరు అధికారిపై క్రమశిక్షణా చర్య చేపట్టిన విషయాన్ని ప్రస్తావించింది. ఐఏఎస్ స్టేట్స్ డీఓపీటీ మార్గదర్శకాల ప్రకారం పదోన్నతులు ఉంటాయని, ఐఏఎస్ ఎంపిక యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని పేర్కొంది. దీనికి అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వులను పక్కనబెడుతున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో రెండేళ్లలో 313 సింహాలు మృతి