కేరళలో అధికారంలోకి ఓసారి ఎల్డీఎఫ్ వస్తే మరోసారి యూడీఎఫ్ వచ్చే సంప్రదాయం ఈ సారి బ్రేక్ అవుతుందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ అన్నారు. ఏప్రిల్ 6న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. భాజపా నేతృత్వం వహించే ఎన్డీఏ కూటమికి ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
"కేరళలో ఎల్డీఎఫ్ కాకపోతే యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందనే భావనను భాజపా తొలగించింది. దీటైన పోటీదారుగా ఎదిగింది. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాము."
-గోపాల్ కృష్ణ అగర్వాల్ ,భాజపా జాతీయ అధికార ప్రతినిధి
కేరళలో పినరయ్ విజయన్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని అగర్వాల్ ఆరోపించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు లేక ప్రజలు వలసపైనే ఆధారపడుతున్నారని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన అభివృద్ధికి చిహ్నాలని, అవే ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించే మార్గాలని అన్నారు. మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ తప్ప వేరెవరూ సీఎం అభ్యర్థిగా కనిపించట్లేదా? అని అడగగా.. భాజపా ఎవరినీ సీఎం అభ్యర్థిగా చూపించదని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ గతంలో సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించలేదని గుర్తుచేశారు.
కేరళలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని భాజపా మాత్రమే ఏర్పాటు చేయగలదని అగర్వాల్ అన్నారు. అభివృద్ధి చెందడానికి కేరళకు చాలా అవకాశాలున్నాయని చెప్పారు. 'లవ్ జిహాదీ'ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిస్టియన్లు సైతం దీని బాధితులేనని అన్నారు. ఆత్మనిర్భర్ కేరళ స్థాపనే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'క్యాచ్ ద రైన్'తో కేంద్రం జలసంరక్షణా యజ్ఞం