SC On Abortion : మహిళలందరికీ సమాన అబార్షన్ హక్కులను కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. వైవాహిక అత్యాచారానికి తొలిసారి చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చింది. అత్యాచారం నిర్వచనంలో వైవాహిక రేప్‌ను సైతం జోడించాలని స్పష్టం చేసింది. వివాహిత మహిళ సమ్మతి లేకుండా జరిగే కలయికతోనూ ఆమె బలవంతంగా గర్భం దాల్చే అవకాశముందని కోర్టు అభిప్రాయపడింది. బలవంతంగా గర్భం దాల్చితే అది అత్యాచారం కిందకే వస్తుందని పేర్కొంది. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన ఆవశ్యతక ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా ప్రస్తుతం దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న వైవాహిక అత్యాచార కేసుల్లో తీర్పులకు ఈ వ్యాఖ్యలు ఓ మార్గం చూపించే అవకాశముందని ధర్మాసనం పేర్కొంది.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టానికి సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. చట్టప్రకారం మహిళలందరికీ సురక్షితంగా గర్భస్రావం చేయించుకునే హక్కుందని స్పష్టం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎంటీపీ చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా.. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని వివక్ష చూపించడం నేరమని పేర్కొంది. రాజ్యాంగం ఎదుట అది నిలవజాలదని స్పష్టం చేసింది. పెళ్లయిన వారిని 24 వారాల లోపు అబార్షన్‌కు అనుమతిస్తూ అవివాహితులను అనుమతించకపోవడం సరికాదన్న ధర్మాసనం.. ఇప్పుడు కాలం మారిందని పేర్కొంది. చట్టం స్థిరంగా ఉండకూడదని సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయని కోర్టు స్పష్టం చేసింది.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టం ప్రకారం అత్యాచార బాధితులు, మైనర్లు, వివాహితులు, మానసిక సమస్యలతో ఉన్నవారు, పిండం సరిగ్గా అభివృద్ధి చెందని ఘటనల్లో మహిళలు 24 వారాల వరకు గర్భస్రావాలు చేయించుకునేందుకు అనుమతి ఉంది. అవివాహితులు తమ సమ్మతితో గర్భం దాలిస్తే అప్పుడు 20 వారాల వరకు మాత్రమే అబార్షన్ చేయించుకునే వీలుంది. తాజా తీర్పుతో ఇప్పుడు పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ గర్భం దాల్చిన 24 వారాలలోపు గర్భస్రావం చేయించుకోవచ్చు.
ఇదీ చదవండి:
కేంద్రం కొత్త రూల్స్- 24 వారాల తర్వాత కూడా అబార్షన్‌కు ఓకే!