మహిళల టాయిలెట్లలోకి దూరి.. రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశాడో యువకుడు. దాదాపు 1200లకు పైగా ఫొటోలు, వీడియోలు ఓ ఫోల్డర్లో సేవ్ చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
ఇదీ జరిగింది.. నిందితుడు శుభమ్.. నార్త్ ఇండియాకు చెందినవాడు. బెంగళూరులోని హోసకెరెహళ్లిలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో బీబీఎమ్ ఐదో సెమిస్టర్ చదువుతున్నాడు. ఆ కాలేజీలో ఉన్న విద్యార్థినుల టాయిలెట్లలోకి రహస్యంగా దూరి వారి అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు తీసేవాడు. అలా ఓరోజు మరోసారి టాయిలెట్లలోకి దూరాడు. యువతులను ఫొటోలు, తీయడం మొదలు పెట్టాడు. అతడిని గమనించిన యువతులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అక్కడినుంచి పారిపోయాడు నిందితుడు. అనంతరం యువతులు కాలేజీ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు టాయిలెట్లలో ఉన్న సీసీటీవీ పరిశీలించగా.. శుభమ్ అజాద్ అని తెలిసింది. కాగా తనను క్షమించమని మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. అయినా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నవంబర్ 18న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకు 1200లకు పైగా ఫొటోలు, వీడియోలు ఓ ఫోల్డర్లో నిందితుడు సేవ్ చేశాడని విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
స్నేహితుడ్ని చంపి కారులో శవంతో పోలీస్ స్టేషన్‌కు
బ్యాంకులో లోన్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసం చేసిన స్నేహితుడిని చంపేశాడో వ్యక్తి. రాడ్డుతో తలపై కొట్టి హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమనగుండి గ్రామంలో మహేశప్ప నివసిస్తున్నాడు. అతడు ఓ కోఆపరేటివ్ సంఘంలో చేరాడు. బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తానని అందులో ఉన్న సభ్యుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఇందులో మహేశప్ప తల్లి పాత్ర కూడా ఉంది. కాగా మోసపోయిన వారిలో రాజశేఖర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడికి మహేశప్పతో గత 13 ఏళ్లుగా పరిచయముంది. మహేశప్పకు తన ఇల్లు అమ్మి మరీ డబ్బు ఇచ్చాడు రాజశేఖర్. తాను మోసపోయానని గ్రహించిన రాజశేఖర్.. మరిన్ని డబ్బులిస్తానని మహేశప్పను నమ్మించి, కారులో తీసుకెళ్లాడు. అవలహళ్లి ప్రాంత సమీపంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రాజశేఖర్.. రాడ్డుతో మహేశప్ప తలపై బలంగా కొట్టాడు. దీంతో మహేశప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో కారులో మృతదేహం తీసుకెళ్లి లొంగిపోయాడు రాజశేఖర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి కుమార్తె కిడ్నాప్..
రాజస్థాన్‌లో ఓ హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసు కలకలం రేపింది. మాజీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గోపాల్ కెసావత్ కుమార్తె అభిలాష కెసావత్ కిడ్నాప్‌నకు గురైంది. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
ఇదీ జరిగింది.. అభిలాష కెసావత్ (21) కూరగాయలు కొనడానికి స్కూటీపై సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఎన్ఆర్ఐ సర్కిల్ అనే ప్రాంతానికి వెళ్లింది. ఆ తర్వాత 7 గంటలకు 'ఎవరో నన్ను వెంబడిస్తున్నారు.. త్వరగా కారు తీసుకుని రండి' అని తన తండ్రికి ఫోన్ చేసింది. అప్రమత్తమైన గోపాల్, కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లగా.. అభిలాష అక్కడ కనిపించలేదు. దీంతో గోపాల్ కెసావత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గత కొద్ది రోజులుగా తనను, తన కుటుంబాన్ని ఎవరో చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. అందులో కొంత మంది పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గోపాల్ కెసావత్ తన కుమార్తె ఆచూకీ లభించేదాకా అక్కడి నుంచి కదలనని పోలీస్ కమిషన్‌రేట్ ముందు నిరసన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.