రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా కళ్లుచెదిరే ప్రకృతి సౌందర్యాలకు పెట్టిందిపేరు. దట్టమైన అడవుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతం దంగ్ క్షేత్రం పేరుతో దేశవ్యాప్తంగా సుపరిచితమే. ఒకప్పుడు ఇక్కడ దోపిడీ దొంగలు స్థావరాలు ఏర్పాటు చేసుకునేవారట. సాధువులు తపస్సులు చేసేవారు. ప్రజలు కనీసం కాలుమోపడానికైనా సిద్ధపడని దట్టమైన అడవి...ప్రస్తుతం నిత్యం పర్యటకులతో కిటకిటలాడుతోంది. గడచిన కొన్నేళ్లలో ఈ ప్రాంతానికి పర్యటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఆ సహజ అందాలను ఎవరైనా రెప్పవాల్చకుండా చూడాల్సిందే.
"ఎన్నో ఏళ్లుగా, తరాలుగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. మంచి ప్రదేశమిది. పైనుంచి నీరు పడుతుంది. 24 గంటలూ, 12 నెలలూ ఇక్కడ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడి జలపాతం నుంచి నిత్యం నీళ్లు జాలువారుతూనే ఉంటాయి. ఎంత వేడిగా ఉన్నా, వర్షాలు పడినా, వాతావరణం ఎలా ఉన్నా పర్యటకులు పెద్దసంఖ్యలో వస్తారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు జైపూర్, ముంబయి లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇది దేవుడి స్థలం."
- అనిల్ గుప్తా, పర్యటకుడు
"మండ్రాయల్‌లోని టప్‌కా కీ ఖో చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడికొచ్చి చూస్తే గానీ ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో తెలియలేదు. చాలా బాగుంది. సంవత్సరం పొడవునా నీరు ఇప్పటిలాగే ఉంటుందని విన్నాం. జలపాతం ప్రవహిస్తూనే ఉంటుంది. చాలామంది పర్యటకులు వస్తారు. గుడి కూడా బాగుంటుంది."
- సౌరభ్ సమధియాన్, స్థానికుడు
మండ్రాయల్ జిల్లాకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో టప్‌కా కీ ఖో ఉంది. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకునే జలపాతమిది. దీనికి ఓవైపు భజ్‌రంగ్‌బలీ, మరోవైపు బోలేనాథ్‌ల ఆలయాలుంటాయి. సిద్ధబాబా ఆశీస్సులతో కోరిన కోర్కెలు నెరవేరతాయని ప్రజల నమ్మిక. సిద్ధబాబా పాదాలు తాకేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఏడాది పొడవునా పర్యటకులు ఇక్కడికి తరలివస్తారు. కొండలు, గుహలు, జలపాతాలు చూపుతిప్పుకోనివ్వవు అనడం అతిశయోక్తి కాదు.
ఇదీ చూడండి: పిల్లలతో పులి కేరింతలు- పర్యటకులు ఫిదా