బంగాల్ శాసనసభ ఎన్నికల్లో అధికార టీఎంసీ, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న వేళ.. అనూహ్య పరిణామం జరిగింది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. 24గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
ఈ ఉత్తర్వులు సోమవారం రాత్రి 8గంటల నుంచి మంగళవారం రాత్రి 8గంటల వరకు అమల్లో ఉంటాయని ఈసీ తెలిపింది. ఈ మధ్యకాలంలో ఏ రూపంలో కూడా.. ఎలాంటి ప్రచారం చేయరాదని ఈసీ ఆదేశించింది.
ఎన్నికల ప్రచారంలో ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరగబడాలన్న వ్యాఖ్యలకు సంబంధించి.. ఈసీ మమతకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు మమతా బెనర్జీ వివరణ ఇచ్చారు. ఆ వివరణతో సంతృప్తి చెందని ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ఇది చీకటి రోజు..
మమత ప్రచారంపై నిషేధం విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘంపై టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భాజపాకు చెందిన విభాగంలా ఈసీ వ్యవహరిస్తోందని విమర్శించింది. ఏప్రిల్ 12 చీకటి రోజు అని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. భాజపాకు ఈసీ పూర్తిగా లొంగిపోయిందని ఆరోపించారు.