స్వచ్ఛభారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రోత్సాహం కింద రూ.12వేలు అందించాయి. దీనిని ఆసరగా చేసుకుని బిహార్లో జరిగిన భారీ స్కాం బయటపడింది. 'లోహియా స్వచ్ఛ బిహార్ అభియాన్' పథకం కింద నితీశ్ కుమార్ ప్రభుత్వం మరుగు దొడ్లు నిర్మాణానికి రూ.12,000 నగదును అందిస్తోంది. ఈ పథకం కింద అర్హుల కింద ఇంతకముందే నగదు పొందిన 40 లక్షల మంది రెండోసారి దరఖాస్తు చేసుకుని నగదు పొందాలని భావించారు. ఈ మోసాన్ని గుర్తించిన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో వెలుగులోకి వచ్చింది.
మోసపూరితంగా రెండో సారి దరఖాస్తు చేసిన వారిని గుర్తించామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు. వారి దరఖాస్తులను తిరస్కరించామని వెల్లడించారు. అక్రమ దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా చేయడానికి 2016లోనే బిహార్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకం కింద ఇప్పటి వరకు 85 లక్షల మందికి నిధులు విడుదల చేసింది.
ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన 30 వేల మంది అభ్యర్థులకు త్వరలో నియామక పత్రాలు అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. రాష్ట్రంలో 8,387 పంచాయతీలు ఉన్నాయి. 6,421 ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ప్రతి పంచాయతీలో ఒక ఉన్నత పాఠశాలను తెరవాలని 2013లో బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఇవీ చదవండి: 'గబ్బర్ సింగ్ ట్యాక్స్.. ఇకనుంచి 'కుటుంబ సర్వనాశన ట్యాక్స్''