ఉత్తర్‌ప్రదేశ్‌లో 4వేల ఏళ్లనాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్‌పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్ సింగ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదునుచేస్తుండగా పురాతన ఆయుధాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. దాదాపు 77 రాగి వస్తువులను స్వాధీనం చేసుకుని.. వారంపాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేసింది. అక్కడ రాగి నిధులతోపాటు, కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు గణేష్‌పురలో 77 రాగివస్తువులు లభించాయని ఏఎస్ఐ ఆగ్రాసర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. ఇందులో16 మానవ బొమ్మలు ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో 3 రకాల కత్తులతోపాటు ఈటెలు లభ్యమైనట్లు వివరించారు. అక్కడ దొరికిన వస్తువులు పూర్తిగా మట్టితో కప్పబడి ఉన్నాయని మరోఅధికారి తెలిపారు. వాటిని ప్రయోగశాలకు తీసుకెళ్లి.. రసాయనాలతో శుభ్రపరిచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాటి పరిమాణం, ఆకృతి ఆధారంగా పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ రాగి వస్తువుల స్వచ్ఛత 98 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ప్రస్తుతం రాగి వస్తువులు దొరికిన చాల్కోలిథిక్ కాలం నాటివి అని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ కాలంలో ఇక్కడ సైనికుల శిబిరం ఉండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరు గారిక్ కుండల సంప్రదాయానికి సంబంధించిన ప్రజలు క్రీస్తుపూర్వం1800 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య ఇక్కడ నివసించి ఉంటారని అంచనా వేశారు. ఆ కాలంలో ప్రజలు రాగితో చేసిన ఆయుధాలను ఉపయోగించేవారని.. మొదటిసారిగా 1822లో కాన్పూర్‌లోని బితూర్‌లో రాగి వస్తువులను కనుగొన్నారు. పురాతన కాలంలో రుషులు మెయిన్‌పురి ప్రాంతంలో తపస్సు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. మెయిన్‌పురిలో తొమ్మిది, పదో శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులను ఇప్పటికే గుర్తించారు. అప్పటినుంచి చాల్కోలిథిక్ యుగంలో మెయిన్‌పురిలో ప్రజలు జీవించి ఉన్నారన్న వాదనలకు బలం చేకూరింది.
ఇదీ చదవండి: భద్రత ప్రమాణాలు లేకుండా మైనింగ్.. పొక్లైన్లో మంటలొచ్చి ఆపరేటర్ మృతి