ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విచిత్ర వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆరాధించిన దైవాన్నేపెళ్లిచేసుకుంది ఓ మహిళ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. బాల్యం నుంచి కృష్ణుడిపై ప్రేమను పెంచుకున్న రక్షా సోలంకి ఆయననే వివాహం చేసుకోవాలనుకుంది. శనివారం బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
రక్షా సోలంకి.. ఔరేయా జిల్లాలోని బిధునా పట్టణంలో నివసిస్తుంది. ఈమెకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరుగుతున్న కొద్ది ఆయననే ఆరాధిస్తూ ప్రేమను పెంచుకుంది రక్షా. చివరకి ఆయననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణుడి విగ్రహానితో పెళ్లి చేసుకుంది రక్షా సోలంకి.

చేతులపై కృష్ణ మెహందీ
శనివారం కృష్ణుడుని పెళ్లి చేసుకున్న రక్ష.. మెహందీ రోజున కన్నయ్య డిజైన్‌ను తన చేతులపై వేసుకుంది. పెళ్లి కూతురు ఆహ్లదకరమైన, మనసుకు ప్రశాంతతనిచ్చే భక్తి పాటలను పాడి అందరిలో ఉత్సాహాన్ని నింపింది. సాధారణంగా వివాహాలలో వరుడు.. వధువుకు గంధం రాసి కుంకుమ పెడతాడు. కానీ ఈ పెళ్లిలో రక్షా సోలంకి.. కృష్ణుడు పేరున తనకు తానే కుంకుమ పెట్టుకుంది. వీరి వివాహం తర్వాత బంధువులంతా ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు. కృష్ణుడు విగ్రహంతోనే వధువు ఇంటి నుంచి బయటకొచ్చింది. రక్షా సోలంకి వివాహం పట్ల ఆమె తండ్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. తన కూతురు సరైన నిర్ణయం తీసుకుందని.. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన అల్లుడని అనందం వ్యక్తం చేశాడు.

కళలోకి వచ్చేవాడు
తనకు కొన్ని రోజులుగా శ్రీకృష్ణుడి గురించి కలలు వస్తున్నాయని చెప్పింది వధువు రక్షా సోలంకి. "కళలో శ్రీ కృష్ణుడు నా మెడలో పూలమాల వేస్తున్నట్లుగా కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాను. వెంటనే వారు నాకు వేరే పెళ్లి చేయాలని భావించారు. కానీ నా తల్లిదండ్రులతో మాట్లాడి కన్నయను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. వారు కూడా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. శ్రీకృష్ణుడుతో పెళ్లి జరగడం వల్ల చాలా ఆనందాన్ని పొందాను.' అని రక్షా సోలంకి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

"31ఏళ్ల నా కూతురికి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. రక్షా సోలంకి కృష్ణుడి భక్తిలోనే ఎక్కువ సమయం గడిపేది. ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ కన్నయ్య ప్రేమలో ఉన్న సోలంకి ఆయననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె కోరికను మాతో వ్యక్తం చేసింది. శనివారం పూజారిని ఇంటికి పిలిచాము. హిందూ ఆచారాల ప్రకారం, కుమార్తెను శ్రీ కృష్ణుడి విగ్రహంతో వివాహం చేశాము. అగ్ని సాక్షిగా కృష్ణుడి విగ్రహంతో కలిసి ఏడడుగులు వేసింది" అని చెప్పారు రక్షా సోలంకి తండ్రి రంజిత్ సింగ్ సోలంకి.
ఇవీ చదవండి: