Interactive robot: కేరళలోని పతానంతిట్టకు చెందిన 14 ఏళ్ల బాలుడు సిదాన్ అద్భుతాలు చేస్తున్నాడు. చదువుతున్నది 9వ తరగతి అయినా.. సొంతంగా ఓ రోబోను తయారు చేశాడు. దీనికి ఓ పేరు కూడ పెట్టాడు. రాస్పీ అని పిలిచే ఈ రోబో.. రజనీకాంత్ సినిమాలో చూపించిన విధంగా.. సిదాన్ ఇచ్చే వాయిస్ కమాండ్ల ప్రకారం నడుచుకుంటుంది.
ఈ రోబో సిదాన్ చెప్పినట్లుగా నడుచుకుంటుంది. అడిగిన వాటికి సమాధానాలను ఇంటర్నెట్లో వెతికి పెడుతుంది. ఇదంతా వాయిస్ కమాండ్ల రూపంలో జరుగుతుంది. ఇందులో కీలకమైన ఇంటరాక్టివ్ సాప్ట్‌వేర్‌ను సిదాన్నే అభివృద్ధి చేశాడు. ఇందుకోసం కంప్యూటర్ కోడ్ ల్యాంగ్వేజ్ అయిన పైతాన్‌ను కూడా నేర్చుకున్నాడు. అంతేకాకుండా నిట్టీ, గ్రిట్టీ అనే యూట్యూబ్ ఛానల్‌ను చూస్తూ మరింత పట్టు సాధించినట్లు తెలిపాడు. రోబోను తయారు చేసే క్రమంలో చాలా సార్లు విఫలం అయినట్లు పేర్కొన్నాడు సిదాన్.
నాలుగో తరగతి చదువుతున్నప్పుడు అమ్మ కొనిచ్చిన ఎలక్ట్రిక్ బొమ్మ సిదాన్ను ఎంతో ఆకర్షించింది. నాటి నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇష్టం పెంచుకున్న సిదాన్.. తొలుత ఇంటిని శుభ్రం చేసే ఆటోమేటిక్ బ్రష్‌ను రూపొందించాడు. అనంతరం కంటి చూపులేని వారికి.. ముందున్న ప్రమాదాన్ని హెచ్చరించే ఓ చేతికర్రను తయారు చేసి స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం తన అవసరాల కోసం నాలుగు చక్రాల బండిని కూడా రూపొందించాడు. అయితే ఏనాటికైనా హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తాను అని చెప్తున్నాడు సిదాన్. దీనికోసం రోబోటిక్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.
ఇదీ చూడండి: