'నేను బతికే ఉన్నానయ్యా - చనిపోయినట్లు నమోదు చేసి పథకాలు ఆపేశారు' - Beneficiaries of YSR Cheyutha Scheme
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 7:25 PM IST
Woman Worried about not Getting Government Schemes: 'నేను బతికే ఉన్నానయ్యా నాకు ప్రభుత్వ పథకాలు అందట్లేదు. ఏపీ సేవ పోర్టల్‌లో నేను చనిపోయినట్లు నమోదు చేశారు. నాకు న్యాయం చేయండి' అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 50 ఇళ్లకు కేటాయించిన ఒక వాలంటీర్ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ఇంటికే అందుతాయని చెబుతున్న నాయకులు, అధికారుల మాటలు వట్టి మాటలు అవుతున్నాయి. బతికున్న వారిని కూడా చనిపోయినట్లు నమోదు చేయడంతో సచివాలయాల పనితీరు ఏ విధంగా ఉందో ఈ ఘటనే ఉదాహరణ.
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావికి చెందిన వడ్డే చౌడక్కకు 2020 సంవత్సరంలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 18 వేల 750 రూపాయలు జమయ్యాయి. తరువాత మరో రెండు విడతలు రావాల్సి ఉండగా అవి రాలేదు. ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించగా తాను చనిపోయినట్లు పోర్టల్‌లో ఉండటంతో పథకాలు అందవని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగట్లేదని వాపోయింది. ఈ విషయమై స్థానిక సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని సంప్రదించగా, వాలంటీర్లు హౌసింగ్ వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాటు జరిగిందని మార్పు కోసం ఆన్లైన్లో పంపినట్లు చెప్పారు.