రహదారి కోసం.. పురుగు మందు డబ్బాలతో గ్రామస్థుల నిరసన - tirupati news
🎬 Watch Now: Feature Video
Villagers Protest for Road : తిరుపతి జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు రహదారి కోసం ఆందోళన చేపట్టారు. రోడ్డు కోసం పురుగు మందు డబ్బాలు చేతబట్టి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో రేణిగుంట - నాయుడుపేట ప్రధాన రహదారి నుంచి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ పరిశ్రమ మీదుగా.. చిందేపల్లికి వెళ్లే రహదారిని పరిశ్రమ యాజమాన్యం వారం రోజుల కిందట మూసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మూసివేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. గతంలో మాదిరిగా రోడ్డు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈ సమస్యపై ఇప్పటికే గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌ను పలుసార్లు కలిశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గ్రామస్థులంతా ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు గ్రామానికి చేరుకుని.. స్థానికులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు పురుగుల మందు డబ్బాల్ని చేతబట్టి ఆందోళనకు దిగారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. పరిశ్రమ యాజమాన్యానికి పని చేస్తున్నారని వాపోయారు. కలెక్టరేట్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో చిందేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.