Tomato Rate record in Madanapalle: మదనపల్లె మార్కెట్‌లో రికార్డ్.. డబుల్ సెంచరీకి చేరువలో టమాటా ధర - Tomato price increased
🎬 Watch Now: Feature Video
Tomato price increased to Rs.196 per kg in Madanapalle: దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా టమాటాల విషయంలో వినియోగదారులు భయంతో వెనకడుగు వేస్తున్నారు. టమాటాలను కొనాలని మార్కెట్‌కు వెళ్లినవారు.. వాటి ధరలను చూసి వెనుదిరుగుతున్నారు. రోజురోజుకి మార్కెట్‌లో టమాటాల ధరలు పెరుగుతుండడంతో ఏం చేయాలో అర్థంకాక అయోమాయంలో పడుతున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో శనివారం రోజున టమాటా ధర రికార్డు మోత మోగింది. కిలో టమాటా ధర ఏకంగా రూ.196 పలికింది. దీంతో ఇప్పట్లో టమాటా ధరలు దిగొచ్చే పరిస్థితి కనబడకపోవడంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.
డబుల్ సెంచరీకి చేరువలో.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో నేడు టమాటా ధర రికార్డు స్థాయిలో పలికింది. కిలో నాణ్యమైన టమాటా ధర ఏకంగా రూ. 196 పలికింది. అయితే, టమాటాల ధర పెరుగుదలకు ప్రధాన కారణం.. బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్ చివరి దశ కావడంతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్‌కు శనివారం రోజున కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చిందని వ్యాపారులు తెలిపారు. దీంతో మార్కెట్‌లో మొదటి రకం కిలో టమాటా ధర రూ.160 నుంచి రూ.196గా, రెండవ రకం టమాట రూ.120 నుంచి రూ.156 వరకు పలికిందని పేర్కొన్నారు. ఇక, 25 కేజీల బుట్ట ధర రూ.4500 నుంచి రూ. 4,900 వరకూ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు వివరాలను వెల్లడించారు.