Tenant farmers: రోడ్డెక్కిన కౌలు రైతులు.. ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్
🎬 Watch Now: Feature Video
Tenant farmers protest: సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర కౌలు రైతు సంఘం అధ్యక్షులు వై. రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలంటూ ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళగిరి భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యాలయం వరకు రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ర్యాలీ నిర్వహించారు. సుమారు 13 కిలోమీటర్ల మేర రైతులు, రైతు సంఘం నేతలు ర్యాలీ చేపట్టారు. మంగళగిరిలోని భూ పరిపాలన శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. కాసేపు పోలీసులు, కౌలు రైతుల మధ్య తోపులాట జరిగింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల పరిస్థితి మరి దారుణంగా తయారైందని రైతు సంఘం నేతలు విమర్శలు గుప్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కౌలు రైతుకి అన్ని పథకాలు దక్కేలా చేశారని.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలను రద్దు చేయడంతో కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా భూ యజమాని నుంచి సంతకం తీసుకోవాలని నిబంధన కౌలు రైతులకు గుదిబండగా మారిందన్నారు. ఈ నిబంధన వల్ల పంట నష్ట పరిహారాలన్నీ భూ యజమానుల ఖాతాలోకి వెళ్లిపోతున్నాయని ఆరుగాలం శ్రమించి నష్టపోతున్న కౌలు రైతుకి ఒక రూపాయి కూడా దక్కటం లేదని కౌలు రైతు సంఘం నేతలు వెల్లడించారు. జగన్ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.