Temple Land Kabja: "బడైనా.. గుడైనా.. డోంట్ కేర్.. మా కన్ను పడితే.." - గుడివాడలో భూ కబ్జా
🎬 Watch Now: Feature Video
Temple Land Kabja in Gudiwada: గుడివాడలో గడ్డం గ్యాంగ్ కబ్జాల పర్వం కొనసాగుతోంది. కోట్ల విలువైన దేవస్థాన భూముల కబ్జాకు వైసీపీ యువనేత తెరలేపారు. సాయిబాబా మందిరం నిర్మాణం పేరిట.. ఆంజనేయస్వామి ఆలయ భూమి ఆక్రమణకు పావులు కదుపుతున్నారు. రాత్రికిరాత్రే షెడ్డు నిర్మించి.. బాబా విగ్రహం ఏర్పాటు చేశారు. అడ్డొచ్చిన అధికారులనూ లెక్కచేయలేదు. కబ్జాపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ నేతల భూదాహానికి అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. చివరకు దేవుడి భూములనూ వదల్లేదు. గుడివాడ నడిబొడ్డున బంటుమిల్లి రోడ్డులో వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఉంది. ఆలయ ఆవరణలో కోట్ల విలువైన ఖాళీ స్థలం ఉంది. దీనిపై వైకాపా నేతల కన్నుపడింది. కబ్జా చేసేందుకు నెల రోజులుగా చదును చేస్తున్నారు. స్థానికులు అడిగితే.. భక్తులకు అన్నదానం చేసేందుకేనని సమాధానమిచ్చారు. దీనిపై వార్తలు రావడంతో రాత్రికిరాత్రే రేకుల షెడ్డు ఏర్పాటు చేసి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించారు. విగ్రహాన్ని తొలగించేందుకు యత్నించిన దేవదాయ శాఖ అధికారులను అడ్డుకున్నారు. చేసేది చేస్తేం... మీరేం చేస్తారో చూస్తాం అంటూ బెదిరించారు.
ఆక్రమణ విషయం తెలుసుకొని సోమవారం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్లు, తెదేపా నేతలు అక్కడికి చేరుకున్నారు. గుడివాడ ఎమ్మెల్యే అండదండలతోనే ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని... తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది విలువైన దేవస్థాన భూమిని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భూ కబ్జాపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారు.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఒత్తిళ్ల వల్లే... పోలీసులు కేసు నమోదు చేయట్లేదని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.