Nara Lokesh speech: అమలాపురంలో ఉన్నా.. అమెరికా పారిపోయినా.. ఎవరినీ వదిలిపెట్టను : లోకేశ్ - Nara Lokesh speech
🎬 Watch Now: Feature Video
Nara Lokesh speech in Mahanadu: రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గోదావరి నీరులాగే ఇక్కడివారి మనసులు కూడా స్వచ్ఛంగా ఉంటాయని ప్రశంసించారు. కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది.. బడుగువర్గాలకు రాజకీయ ప్రవేశం కల్పించింది.. ఎన్టీఆర్ అని కొనియాడారు. ఏపీని ప్రపంచ పటంలో పెట్టింది.. మన చంద్రన్న అని నారా లోకేశ్ తెలిపారు.
ఎన్నో పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారని అన్నారు. టీడీపీ.. ఘన చరిత్ర ఉన్న పార్టీ అని.. వైసీపీ అంటే గలీజు పార్టీ అని మండిపడ్డారు. చంద్రన్నది అభివృద్ధి బాట.. జగన్‌ది అవినీతి బాట అని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి సైకోగా మారారని.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా అని లోకేశ్ ప్రశ్నించారు. లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా అని నిలదీశారు. వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా అని ధ్వజమెత్తారు. అన్నీ ధ్వంసం చేయడమే సీఎం జగన్ పరిపాలన అని.. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ, విశాఖలో ప్యాలెస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేశ్ ఆగడు.. కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్ స్పందించడని ఎద్దేవా చేశారు.
కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడు చేపట్టారని.. కరెంట్ బిల్లులు, ఆర్టీసీ టికెట్లపై జగన్ తన ఫోటో ముద్రించాలని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు.. వైసీపీ ప్రభుత్వంలో రంగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని.. పేదల ఇళ్ల స్థలాల పేరుతో 7 వేల కోట్ల రూపాయలను లూటీ చేశారని ఆరోపించారు. ఇళ్లు కట్టుకునే స్తోమత పేదలకు ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని హెచ్చరించారు.
పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్‌లో ఉందన్న లోకేశ్.. పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పేదలు ఎప్పటికీ పేదరికం లో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక అని మండిపడ్డారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అన్నది మీ లోకేశ్ ఎజెండా అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం వస్తుందన్నారు.
వైసీపీ పాలనలో యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులంతా బాధ పడుతున్నారని.. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని విమర్శించారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని.. తన పాదయాత్రలో రాయలసీమ ప్రజల కష్టాలు చూశానని నారా లోకేశ్ చెప్పారు. తమ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని.. అంబేడ్కర్ రాజ్యాంగంతో ఈ ప్రభుత్వానికి జవాబు చెప్పానని తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన ఎవరినీ వదిలిపెట్టన్న లోకేశ్.. పెద్దపెద్ద సైకోలను ఎదిరించిన ఘనత టీడీపీది అని నారా లోకేశ్ తెలిపారు.