చెప్పుకోడానికి ఒక్క పనీ చేయలేదు గానీ చంద్రబాబుపై విమర్శలా - టీడీపీ నేతలు ఏం చేశారంటే! - tidko houses
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 1:42 PM IST
Venkata Prasad Selfie Challenge In YCP Government: శ్రీసత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వం చేసిన పనులను తమ గొప్పలుగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులను పూర్తి చేసింది. వాటిని తామే చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు అని కందికుంట అన్నారు. గతంలో మంజూరైన రహదారుల వివరాలను ఆధారాలతో సహా మీడియాకు చూపించారు.
అధునాతన సదుపాయాలతో 1100కు పైగా టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం నిర్మించిందని.. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయడం కూడా జగన్ ప్రభుత్వానికి చేతకాలేదని వెంకటప్రసాద్ విమర్శించారు. నిర్మాణాలు పూర్తి అయిన టిడ్కోసముదాయం ఎదుట ఆయన వైసీపీ ప్రభుత్వం, సిద్ధారెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అభివృద్ధి కోసం ఇతర ప్రభుత్వాలు చేపట్టిన పనులను తమ ప్రభుత్వమే చేసిందని చెప్పుకోవడం సరికాదని హితవు పలికారు. చెప్పుకోదగిన ఒక్క అభివృద్ధి కూడా చేపట్టని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. తమ అధినేత చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, ప్రతిపక్ష నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు.