TDP Leader GV Reddy on Skill Development: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వైసీపీ డ్రామాలు ఆడుతోంది: జీవీ రెడ్డి - TDP Leader GV Reddy comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2023, 4:46 PM IST
TDP Leader GV Reddy on Skill Development: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల మళ్లింపు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై.. అధికార పార్టీ వాళ్లు చేస్తున్న ప్రచారాలన్నీ పచ్చి అబద్దాలని.. ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తెలిపారు. కోడికత్తి డ్రామా, వైఎస్ వివేకానందరెడ్డి తరహాలోనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా వైఎస్సార్సీపీ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో కోర్టుల్లో ఓ రకంగా.. ప్రజల్లో మరో రకంగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకి దమ్ము, ధైర్యం ఉంటే..షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు, అడ్రస్‌లు, డైరెక్టర్ల పేర్లను వెల్లడించాలని జీవీ రెడ్డి సవాల్ విసిరారు.
GV Reddy Comments: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో షెల్ కంపెనీలున్నాయంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలపై.. టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వైఎస్సార్సీపీ డ్రామాలు ఆడుతోంది. ఏవేవో పేర్లతో షెల్ కంపెనీలని ప్రచారం చేస్తోంది. కానీ, ఆ షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు, అడ్రస్‌లు, డైరెక్టర్ల పేర్లు మాత్రం ప్రస్తావించడం లేదు. ఆ షెల్ కంపెనీల పేర్లను కూడా పూర్తిగా రాయడం లేదు. ఏయే షెల్ కంపెనీల పేర్లు ప్రెస్‌మీట్లో చెబుతున్నారో.. ఆ పేర్లను కోర్టుల్లో ఎందుకు చెప్పరు..?, రిమాండ్ రిపోర్ట్ దగ్గరకు వెళ్లేసరికి.. షెల్ కంపెనీల ప్రస్తావన ఎందుకు లేదు..?, సాక్ష్యాలు లేకుండా నామమాత్రంగా రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. న్యాయస్థానాలకు ఒకలా.. ప్రజలకు మరొకలా చెబుతున్నారు.'' అని ఆయన అన్నారు.