TDP Boycotted Assembly Sessions: నేటినుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ.. ఎన్టీఆర్ భవన్‌లో నేడు సమావేశం..
🎬 Watch Now: Feature Video
TDP Boycotted Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై తెలుగుదేశం శాసనసభా పక్షం చర్చించనుంది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలను(AP Assembly) బహిష్కరించిన తెలుగుదేశం(TDP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం కానున్నారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందున ప్రభుత్వ తీరుకు ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెప్తామని ధ్వజమెత్తారు. ఈ టీడీఎల్పీ భేటీలో తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా అధికార పక్షం తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ తెలిపింది. శనివారం నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీనిపై సభలో ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో చర్చ జరపాలంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో పోడియం వద్ద నిరసన తెలిపారు. మరోవైపు గురువారం 16 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసింది. శుక్రవారం కూడా నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది.