Saluru Municipal Commissioner in ACB Trap: లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్ - 150000 లంచం తీసుకున్న మున్సిపల్ కమిషనర్
🎬 Watch Now: Feature Video
Saluru Municipal Commissioner in ACB Trap: పార్వతీపురం మన్యం జిల్లా పురపాలక సంఘం కమిషనర్ శంకర్రావు ఏసీబీ వలకు చిక్కాడు. సాలూరు పట్టణం గొర్లివీధిలో ఓ భవన సముదాయం నిర్మాణ పనులు కొనసాగింపు, పన్ను విధింపు నిమిత్తం, గుత్తేదారు నుంచి లక్షన్నర రూపాయలు లంచం తీసుకుంటూ, మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం సాలూరు పట్టణంలోని గొర్లివీధిలో బద్రినాధ్ అనే వ్యక్తి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను రమణకుమార్ అనే గుత్తేదారునికి అప్పగించారు. అయితే నిర్మాణంలో లోపాలు చోటు చేసుకున్నట్లు, పురపాలక సంఘం అధికారులు అభ్యంతరం తెలిపారు. నిర్మాణ పనుల కొనసాగింపు కోసం నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు, పన్ను విధింపునకు, మున్సిపల్ కమిషనర్ శంకర్రావు గుత్తేదారుని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా ముందుగా గుత్తేదారు 50 వేలు రూపాయలు ముట్టచెప్పారు. శంకర్రావు మిగిలిన లక్షన్నర తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గతంలోనూ కమిషనర్ శంకర్రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.