ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలతో ఆడుకుంటున్నారు - ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు : పురందేశ్వరి - టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 3:59 PM IST
Purandeswari Fire On YS Jagan Govt Over TIDCO houses construction: వైసీపీ ప్రభుత్వం టిడ్కో (TIDCO) గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించిన ఆమె, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ఇళ్లను బ్యాంకులో తాకట్టుపెట్టారని లబ్ధిదారులు పురందేశ్వరి ముందు వాపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పురందేశ్వరి ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలతోనే వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు బ్యాంకు నోటీసులపై కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు లక్షా అయిదు వేలకు పైగా ఇల్లు మంజూరు చేస్తే, వాటిలో ఎన్ని ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.
మాట తప్పం, మడమ తిప్పం అన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడత పెట్టి మాట్లాడుతున్నారని పురందేశ్వరి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నిరంకుశ పరిపాలన కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్న దుస్థితిని చూస్తున్నామని అన్నారు. నరసాపురం - కోటిపల్లి రైల్వే లైన్ పనులకు కేంద్రం వాటా 75% నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్రం వాటా 25% విడుదల చేయకే పనులు నత్తనడకన సాగుతున్నాయని పురందేశ్వరి విమర్శించారు.