Pregnants Problems Due to Lack of Road Facilities: ప్రసవ వేదన.. ఓ పక్క పురిటి నొప్పులు.. మరో పక్క కాలినడక - అల్లూరి సీతారామరాజు జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Pregnants Problems Due to Lack of Road Facilities: తరాలు మారినా.. గిరిజనుల తలరాతలు మాత్రం మారటం లేదు. కొండ ప్రాంతాల్లో సరైన రహదారులు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో గర్భిణులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవటంతో వారంరోజుల కిందట ఓ నిండు గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. ఇది మరువక ముందే తాజాగా ఇలాంటి మరో ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్లు లేకపోవటంతో పురిటి నొప్పులతో సతమవుతున్న ఓ నిండు గర్భిణి మూడు కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఎదురయింది. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ చీపురుగొందిలో కావ్య అనే ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను ఆస్ప్రత్రి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ వచ్చేందుకు రహదారి లేకపోవటంతో కిముడుపల్లిలోనే వాహనం ఉండిపోయింది. దీంతో చేసేదేంలేక గర్భిణిని.. వర్షంతో బురదమయంగా మారిన ప్రమాదకరమైన దారిలో మూడు కిలోమీటర్ల మేర నడిపించుకుని.. అంబులెన్స్ వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ చికిత్స పొందిన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రహదారులు లేక మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం దీనిపై స్పందించి తమ మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం రోడ్లు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.