Police Raids in Employees Houses: వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ఇళ్లలో తనిఖీలు.. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం
🎬 Watch Now: Feature Video
Police Raids on Commercial Tax Employees Houses : అవినీతి ఆరోపణలపై ఇప్పటికే అరెస్టైన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఇళ్లలో విజయవాడ పోలీసులు సోదాలు నిర్వహించారు. విజయవాడ, గుడివాడ, హైదరాబాద్‌లోని 6 చోట్ల బృందాల వారీగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేశారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఇవి కొనసాగాయి. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడమే కాకుండా వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాలపై గత నెలలో కేసు నమోదు చేసి జీఎస్టీవోలు మెహర్ కుమార్, సంధ్య, సీనియర్ అసిస్టెంట్ చలపతి, ఆఫీసు సబార్డినేట్ సత్యనారాయణలను పటమట పోలీసులు అరెస్టు చేశారు. A5 గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు KR సూర్యనారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. సత్యనారాయణపురంలోని ఆయన ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించారు.
హైదరాబాద్‌లో ఆయన కుటుంబీకులు ఉన్న ఇంటిలో సోదాలు చేశారు. పోలీసుల అదుపులో ఆయన ఉన్నారన్న ప్రచారాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. సోదాల సందర్భంగా ఐదుగురి ఇళ్ల నుంచి పోలీసులు ఆస్తుల దస్తావేజులు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జీఎస్టీవో మెహర్‌కుమార్ ఇంట్లో 500గ్రాముల బంగారం, 10కిలోల వెండి, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చలపతి ఇంట్లో రెండున్నర లక్షల నగదు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తన కార్యాలయంలో వదిలి పెట్టిన ఫోన్ల కాలేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కేసులో A1 అయిన మెహర్ కుమార్ ఫోన్‌కు 954 కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటి ఆధారంగా సూర్యనారాయణ పాత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు.