Power Cuts in Gudivada: మండుతున్న ఎండలు.. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి.. గుడివాడలో కరెంట్ కట్.. కట్‌చేస్తే - గుడివాడలో అర్ధరాత్రి ప్రజలు ఆందోళన
🎬 Watch Now: Feature Video
Power Cuts in Gudivada: ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఉక్కపోతలు ఇది రాష్ట్రంలో పరిస్థితి. ఎండ వేడికి తట్టుకోలేక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద కూర్చొని ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అలాంటి సమయంలో కరెంటు కట్‌చేస్తే.. మధ్యాహ్నం అయితే బయట కూర్చోవడం లేకపోతే విసనకర్రలతో విసురుకోవడం లాంటివి చేస్తారు. మరి రాత్రి పడుకునే సమయంలో అయితే కరెంటు లేక గాలి ఆడక నానా అవస్థలు పడతారు. అలా ఓ పది నిమిషాలు అయితే ఏదో ఒకలా సర్దుకుంటారు. మరి గంటల కొద్ది తీస్తే.. అదీ కాకుండా రోజులు అయితే.. ప్రజలు ఎదురుతిరుగుతారు. తాజాగా ఇలాంటి ఘటనే గుడివాడలో చోటుచేసుకుంది.
కరెంట్ కోతలకు నిరసనగా కృష్ణా జిల్లా గుడివాడలో అర్ధరాత్రి ప్రజలు ఆందోళన నిర్వహించారు. అడ్డగోలు కరెంటు కోతలు సరికాదంటూ.. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. అర్ధరాత్రి పన్నెండున్నర దాటినా కరెంటు ఇవ్వకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. వేళాపాళా లేకుండా రెండు రోజులుగా కరెంట్ కోతలు విధిస్తున్నారని.. మండిపడ్డారు. ఉక్కపోతతో అల్లాడిపోతుంటే.. అర్ధరాత్రి కరెంట్ కోతలు ఏంటని విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. ప్రజల ఆందోళనలతో మచిలీపట్నం- తిరువూరు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ ఇచ్చేవరకు తిరిగి ఇంటికి వెళ్లమంటూ ప్రజలు పట్టుబట్టడంతో.. గుడివాడ ట్రాఫిక్ పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని పరుష పదజాలంతో దూషించారు. అర్ధరాత్రి ఒకటిన్నరకు కరెంటు ఇవ్వడంతో.. ఆందోళన చేస్తున్న ప్రజలు తిరిగి ఇళ్లకు వెళ్లారు..