'నాయీ బ్రాహ్మణులకు.. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు' - nayi brahmins
🎬 Watch Now: Feature Video
Nayee Brahmin Association: ఎన్నో ఏళ్లుగా నాయీ బ్రాహ్మణులకు కులవృత్తి పరంగా, రాజకీయపరంగా అన్యాయం జరుగుతూనే ఉందని నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ద్రాక్షారపు సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహాసభలు.. జూలై 11వ తేదీన తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరగనున్నాయని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. నాయీ బ్రాహ్మణులలో ఎక్కువ మంది తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని కానీ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేసిన సెలూన్లలో నాయీ బ్రాహ్మణులు జీతగాళ్లుగా మారుతున్న పరిస్థితి ఉందని అన్నారు. నాయీ బ్రహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యం పెంచి సెలూన్ల ఏర్పాటుకు 50% సబ్సిడీతో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయాల పరంగాను తమ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. జనాభా ప్రకారం రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసే మహాసభలలో ప్రతి ఒక్క నాయీ బ్రాహ్మణుడు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.