అంగన్వాడీల అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనం: లోకేశ్ - అంగన్వాడీలపై జగన్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 6:17 PM IST
Nara Lokesh Comments on Anganwadis Arrest: అంగన్వాడీల ఆందోళనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్ నియంతృత్వానికి నిదర్శనమని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమేనని ఆయన మండిపడ్డారు. విజయవాడ ధర్నాచౌక్లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయటంపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను ఆయన విడుదల చేశారు.
అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్దమైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్ధతు ఉంటుందని హామీ ఇచ్చారు. అంగన్వాడీల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించిన లోకేశ్, ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇప్పటికే పలు దఫాలుగా అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుకు నిరసనగా సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.