'ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్‌రెడ్డి వర్గం పెత్తనం - జనాన్ని భయపెడుతున్న ఆ ఇద్దరు'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 5:12 PM IST
Nakka Anand Babu fire on CM Jagan Reddy : ప్రజలు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకుంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో నలుగురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. మొత్తం 36 రిజర్వుడ్ నియోజకవర్గాలను రాష్ట్రంలోని 4 కుటుంబాలు వాటాలు వేసుకుని పంచుకున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాలు మిథున్‌రెడ్డి, కృష్ణా, గుంటూరు సజ్జల, ప్రకాశం జిల్లా బాలినేని, రాయలసీమ పెద్దిరెడ్డికి మానిటరింగ్ ధనుంజయరెడ్డికి అప్పగించారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్‌రెడ్డి వర్గం పెత్తనమేంటని ప్రశ్నించారు. ప్రజలు కల్పించిన దళిత శాసనసభ్యులను కాదని జగన్‌రెడ్డి సొంత వర్గాన్ని ప్రజలపై రుద్దడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.
నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ షాడో ఎమ్మెల్యేలను దళితులపై రుద్దుతావా అని ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న నేతలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి నీ సొంత సామాజిక వర్గాన్ని దళితుల మీదకు వదులుతారా అని నిలదీశారు. అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో టూరిజం, మైనింగ్ అత్యధికంగా ఉంటుంది. వీటికోసం విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పోటీపడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. చింతపల్లిలో బాక్సైట్, పాడేరులో లాటరైట్, రంగు రాళ్లు, క్వార్ట్ ్జ ఖనిజాల అక్రమ తవ్వకంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డికి సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. షాడో ఎమ్మెల్యేలతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న జగన్మోహన్‌రెడ్డికి సమాధి కట్టేందుకు బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.