MOU For Two Pumped Storage Projects in AP విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా నేడు రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులకు ఎంఓయు..
🎬 Watch Now: Feature Video
MOU For Two Pumped Storage Projects in AP: రాష్ట్రంలో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు(Pumped Storage Project)ఏర్పాటునకు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదరనుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(APGENCO), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHPC) సంయుక్తంగా.. పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగావాట్లు, అనంతపురం జిల్లా కమలపాడులో 950 మోగావాట్లు కలిపి మొత్తం 1950 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పీఎస్పీలను సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణానికి రెండు సంస్థలు పరస్పరం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ (జేపీవీ) ఏర్పాటు చేయనున్నాయి. రెండు పీఎస్పీల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (MOU)పై నేడు సంతకాలు చేయనున్నారు. సరిసమాన భాగస్వామ్యంతో పీఎస్పీలు నిర్మించాలని ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ నిర్ణయం తీసుకున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ, ఏపీజెన్‌కో పునరుత్పాధక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారించాయని.. ఇందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పది పీఎస్పీల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నెడ్‌క్యాప్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీజెన్‌కో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కూలంకుషంగా అన్ని అంశాలపై లోతుగా చర్చించి రాష్ట్రంలో కొత్తగా పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది.