MLA reaction on YCP activist Krishna Reddy murder: కృష్ణారెడ్డి హత్య ఘటనపై వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 8:21 PM IST
MLA reaction on YCP activist Krishna Reddy murder: పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురజాల మండలం జంగమహేశ్వరపురంలో వైసీపీ నేత కృష్ణారెడ్డి హత్య ఘటనలో రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ నేరథ్యంలో గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న గురజాల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
నిందితులను కఠినంగా శిక్షించాలి: జంగమహేశ్వరం గ్రామంలో వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ (YCP) ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి వెల్లడించారు. చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇది కేవలం రాజకీయ హత్యే అని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ గెలిచే అవకాశం లేదని... ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎలాగైనా గెలవాలని కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణారెడ్డి హత్య కేసులో ఎంతటి వారున్నా, మాజీ శాసనసభ్యులు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహేశ్‌రెడ్డి తెలిపారు. నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందంటూ కాసు మహేశ్‌రెడ్డి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
కాసు మహేశ్‌రెడ్డి వచ్చిన తర్వాతే ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగాయి: ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ (TDP) సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. కృష్ణారెడ్డి హత్యకు వివాహేతర సంబంధం, స్థానిక తగాదాలే కారణమని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే కాసు.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసు మహేశ్‌రెడ్డి వచ్చిన తర్వాతే గురజాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగాయని యరపతినేని ఆరోపించారు. 2019 తర్వాత టీడీపీ కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్లేలా చేశారని గుర్తు చేశారు. తనపై హత్య కేసు పెట్టడానికి కాసు మహేశ్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని యరపతినేని ఖరాఖండిగా చెప్పారు.
కొనసాగుతున్న విచారణ: పల్నాడు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరం గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. కునిరెడ్డి కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్తను ప్రత్యర్థులు వేట కొడవళ్ళుతో దారుణంగా హత్య చేశారు. మృతుడు పులిపాడు గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపు సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వైన్ షాప్ విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో సంగమేశ్వరం వద్ద కృష్ణారెడ్డి పై ప్రత్యర్థులు వేట కొడవళ్లు, గొడ్డలతో హత్య చేసినట్టుగా స్థానికులు తెలిపారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.