Missing Boy Surprise: బాలుడిగా వెళ్లి.. యువకుడిగా.. 13 ఏళ్లకు తెలిసిన ఆచూకీ.. - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Missing Boy Surprise: అనంతపురం జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. 13 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిగా ఆచూకీ ఇప్పటికి తన కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలోని దుర్గమ్మ గుడి ప్రాంతానికి చెందిన శివ అనే యువకుడి 13ఏళ్ల వయసులో తన తల్లి రత్నమ్మ మృతిచెందగా.. ఆవేదనతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. యువకుడి ఆచూకీ కోసం అతడి కుటుంబం పదమూడేళ్లుగా అనేక ప్రాంతాల్లో వెతికింది. అయినా ఫలితం లేకపోయింది. అయితే ఆ యువకుడు ప్రస్తుతం ఉరవకొండలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలో ఓ ఇరానీ కేఫ్‌లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. ధర్మవరానికి చెందిన వారి బంధువు అక్కడికి టీ తాగడానికి వెళ్లినప్పుడు అతడిని గుర్తించాడు. వెంటనే ఈ సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందించాడు. వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులకు అతడిని చూపించారు. దీంతో ఆ యువకుడిని గుర్తించి.. తండ్రి నాగశెట్టి, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బంధువులు సాయంత్రం వాహనాల్లో ఉరవకొండకు చేరుకుని కలుసుకున్నారు. కాగా.. ఆ యువకుడు కొన్నాళ్లు ఇక్కడే పనిచేసి.. తర్వాతే ఇంటికి వస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా తిరిగి వెళ్లారు.