తిరుపతిలో రైలు దిగుతుండగా జారి పడ్డ ప్రయాణికుడు.. రక్షించిన పోలీసులు - ఆర్పీఎఫ్ సిబ్బంది
🎬 Watch Now: Feature Video
Railway Police Saved Man: తిరుపతి రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రైలు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ట్రైన్ నుంచి దిగటానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన రైల్వే రక్షక్ష దళం సిబ్బంది తక్షణమే స్పందించి.. ప్రయాణికుడిని కాపాడారు. రైల్వే రక్షక దళం తిరుపతి ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటల 22 నిమిషాల సమయానికి.. తిరువనంతపురం నుంచి నిజాముద్దీన్ వెళ్లాల్సిన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్, తిరుపతి రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారంపై వచ్చి ఆగింది. 7 గంటల 28 నిమిషాలకు రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరింది. అదే సమయంలో పశ్చిమ బంగాకు చెందిన స్వపన్ కుమార్ రాయ్ అనే ప్రయాణికుడు కదులుతున్న స్వర్ణ జయంతి రైలు నుంచి దిగటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కాలుజారి.. రైలుకు, ఫాట్ ఫారానికి మధ్యలో పడబోయాడు. వెంటనే అక్కడున్న రైల్వే రక్షక దళానికి చెందిన కానిస్టేబుల్ లోకనాథం, మహిళా కానిస్టేబుల్ సంపూర్ణ స్పందించారు. ప్రయాణికుడ్ని రైలు నుంచి పక్కకు లాగి కాపాడారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుడికి ఎటువంటి గాయాలు కాలేదని ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. ప్రయాణికుడ్ని కాపాడిన సిబ్బందిని ఆయన అభినందించారు.