ఉత్తరాంధ్రని విధ్వంసం చేసిన జగన్ దొడ్డిదారిన విశాఖకు మకాం మారుస్తున్నారు: లక్ష్మీనారాయణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 10:37 AM IST
Lakshminarayana Allegations on Jagan Moving Administration to Visakha: క్యాంప్ ఆఫీసుల ముసుగులో.. పాలనను విశాఖకు తరలించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి.లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఉన్నత న్యాయ స్థానాల తీర్పులపై గౌరవం ఉంటే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడి ఉండేది కాదని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి, ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయడానికే ఈ ఉత్తర్వులు జారీ చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, పర్యవేక్షణ కోసం విశాఖపట్నంలో రాత్రిపూట బస చేయటం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
విభజన చట్టం కింద హక్కుగా రావాల్సిన రాయలసీమ- ఉత్తరాంధ్ర అభివృద్ధి నిధుల మాట ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వమే భూమి కేటాయించలేదని తెలుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేయడానికి విశాఖలో క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారో సీఎం రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.