KGBV Teachers Protest: తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి.. కేజీబీవీ మహిళా అధ్యాపకుల ఆందోళన - కేజీబీవీ మహిళా అధ్యాపకులు ఆందోళన
🎬 Watch Now: Feature Video
KGBV Women Teachers Protest in Vijayawada: విజయవాడలోని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయం ఎదుట కేజీబీవీ మహిళా అధ్యాపకులు ఆందోళనకు దిగారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కేజీబీవీలలో అధ్యాపకులుగా పని చేస్తున్న తెలుగు, ఆంగ్ల పీజీటీలను విధుల నుంచి తొలగించడంపై అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందని అన్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
2018 నుంచి తాము అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం పెట్టిన అనేక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే తమకు ఉద్యోగం వచ్చిందని అధ్యాపకురాలు రేఖ అన్నారు. తమను గురువారం నుంచి విధులకు హాజరు కావద్దని సమగ్ర శిక్షా అభియాన్ ప్రిన్సిపల్ చెప్పడం అన్యాయమన్నారు. సంస్కరణల్లో భాగంగా తెలుగు, ఇంగ్లీషు పీజీటీలు అవసరం లేదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఆ జిల్లాలో ప్రిన్సిపాల్స్ తమను విధులకు రావద్దని చెబుతున్నారని వాపోతున్నారు.
గత ఐదు సంవత్సరాలుగా కేవలం 12 వేలు వేతనంతో పనిచేస్తూ వేతనాల పెంపు అమలు కోసం ఎదురు చూస్తున్న తమకు నేడు ఉద్యోగాలే లేకుండా చేయడం అన్యాయమని మహిళా అధ్యాపకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 200 మంది అధ్యాపకులు రోడ్డున పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తమను యధావిధిగా కొనసాగిస్తూ జిల్లా అధికారులకు తగు ఆదేశాలివ్వాలని సమగ్ర శిక్షా అభియాన్ ఉన్నతాధికారులను కోరారు.