చెత్తబుట్టల వివాదం.. అధికారులపై కార్పొరేటర్ల ఆగ్రహం - Kadapa City Council Meeting
🎬 Watch Now: Feature Video
Kadapa Corporation Meeting: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ కార్పొరేటర్లే.. విపక్షం పాత్ర పోషించి అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడీగా సాగింది. ప్రధానంగా కడప నగరంలో ఇంటింటికి చెత్తబుట్టలు పంపిణీ చేసేందుకు 2 కోట్ల 73 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచారు.
ఈ చెత్త బుట్టల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని అధికార పార్టీ కార్పొరేటర్లు సమావేశంలో ప్రస్తావించారు. బుట్టలు ఎన్ని కొనుగోలు చేశారు.. ప్రజలకు ఎన్ని పంపిణీ చేశారో అధికారులు లెక్కలు చెప్పాలని కార్పొరేటర్ సూర్యనారాయణ ప్రశ్నించారు. కానీ ఇంజినీరింగ్ అధికారులు ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనం వహించారు.
దీంతో రెచ్చిపోయిన కార్పొరేటర్లు.. ఏం అడిగినా అధికారులు సమాధానం చెప్పరు.. ఎందుకు ఇలాంటి సమావేశాలు అంటూ మండిపడ్డారు. సమావేశం నుంచి బయటికి వెళ్లిపోతే మంచిదని తీవ్రస్థాయిలో ఆవేశం వెళ్ల గక్కారు. ప్రతి సమావేశంలోనూ అధికారులు దేనికీ సమాధానం చెప్పకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. వీధుల్లోకి వెళ్తే ప్రజలు చెత్తబుట్టలు కావాలని అడుగుతున్నారని.. కొనుగోలు చేసిన బుట్టలు ఎమయ్యాయో తెలియడం లేదన్నారు.
వైసీపీ కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు మేయర్ సురేష్ బాబు కూడా సమాధానం చెప్పకుండా చూస్తూ ఉండిపోయారు. అయితే ఈ తతంగం అంతా చిత్రీకరిస్తున్న మీడియాపై మాత్రం మేయర్ సురేష్ బాబు చిర్రుబుర్రు లాడాడు. కార్పొరేటర్లు ఫొటోలకు ఫోజులిచ్చింది చాలు.. కూర్చోండని చెబుతూనే.. మీడియా మొత్తం బయటికి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.