కొల్లేరులో అక్రమ చెరువుతవ్వకాలు.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.. అడ్డుకున్న అటవి,రెవెన్యూ సిబ్బంది - కొల్లేరు చెరువు తవ్వకాలు
🎬 Watch Now: Feature Video
Kolleru Lands Digging: ఆటపాకలోని కొల్లేరు అభయారణ్యం కాంటూరు పరిధిలో శనివారం అక్రమ చెరువు తవ్వకాలకు స్వయానా ప్రజాప్రతినిధి భూమిపూజ చేసి మరీ ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. మంచినీళ్ళ చెరువు పేరు చెప్పి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు... కొబ్బరికాయ కొట్టి మరీ పనులు ప్రారంభించారు. కొల్లేరులో అక్రమ చెరువుల తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొల్లేరు అభయారణ్యం పరిధిలో చెరువుల తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా తవ్వకాలు మాత్రం యధేచ్చగా సాగుతున్నాయి. రాత్రీ పగలు తేడా లేకుండా... భారీ యంత్రాలతో కాంటూరు పరిధిలో చెరువులు తవ్వెస్తున్నారనే ఆరోపణలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి.
తాజాగా, ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కాంటూరు పరిధిలో మంచినీటి చెరువు పేరుతో తవ్వుతున్న అక్రమ చెరువుకు.. స్వయంగా ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశఆరు. కైకలూరు మండలం ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ ప్రాంతంలో తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరులో చేపట్టిన ఈ తవ్వకాలను అడ్డుకున్న అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు రెండు యంత్రాలను సీజ్ చేశారు. తవ్వకాలు సాగిస్తున్న చెరువును పరిశీలించిన ఏలూరు అటవీ శాఖ డీఎఫ్ఓ రవిశంకర్... కొల్లేరు అభయారణ్యంలో తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువు తవ్వే సమయంలో ఎమ్మెల్యేతో అటవీశాఖ సిబ్బంది కలిసి ఫోటోలు దిగడం చూస్తుంటే కంచే చేను మేసిన చందంగా అనిపిస్తోందని.. స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.